తెలంగాణా సంప్రదాయ పండుగ బోనాలు....బోనం అంటే ఏమిటి..? ఆషాఢంలోనే ఎందుకు జరుపుతారు?
తెలంగాణ అంతట ఆషాఢ జాతర బోనాల పండుగ సందడి కనిపిస్తుంది. ఈ బోనాల పండుగ గోల్కొండలో తొలిబోనం సమర్పించడంతో ఈ జతర అంగరంగ వైభవంగా మొదలవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగ ఘనంగా జరుపుకుంటారు. Sri Media News
తెలంగాణ సంప్రదాయానికి చిహ్నం ఈ బోనాలు. ఈ బోనాల జాతర ఓ క్రమ పద్దతిలో జరుగుతుంది. ఒక ఆలయం తర్వాత మరో ఆలయంలో జరుపుకుంటారు. ఆషాఢ జాతర గోల్కొండ కోటలోని మహంకాళి ఆలయంలో మొదటగా వచ్చే గురువారం రోజు కానీ.. ఆదివారం రోజు కానీ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి ఆదివారం, గురువారం బోనాల జాతర జరుగుతు ఉంటుంది. ఈ బోనాలను మహిళలే సొంతంగా తయారు చేసి... చూట్టు ఉన్నవారితో కలిసి... అందరి బోనాలను ఒక చోట పెట్టి అందరు కలిసి పాటలు పాడుతూ... బోనాల చూట్టు తీరుగుతూ... కలిసి కట్టుగా చేసుకుంటారు. ఈ బోనాలను ఒక్క తెలంగాణలోనే కాదు... ఆంధ్రాలోని రాయలసీమ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. ఈ బోనాలు గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అను బంధాలను పెంపొందించే వారిధిగా చెప్పవచ్చు.ఈ పండుగను జూలై లేక ఆగష్టులో వచ్చే ఆషాఢమాసంలో జరుపుకుంటారు.
బోనం అంటే భోజనం అని అర్థం వస్తుంది. బోనాల పండుగలో గ్రామ దేవతలకు మూడు కొత్త కుండలో భోజనం వండుతారు. అలాగే మరో చిన్న మట్టి ముంతలో బెల్లం పానకం సిద్దం చేస్తారు. మహిళలు వండిన అన్నంతో పాటు ఉల్లిపాయతో చేసిన అన్నం, పెరుగు, పాలు, బెల్లం ను మట్టి కుండలలో పెట్టి వాటిని అందంగా అలంకరిస్తారు.
ఆ తర్వాత ఆ కుండపై దివ్వె పెట్టి ఆడపడుచులు నెత్తిపై బోనం ఎత్తుకొని ఒక చేతిలో వేపాకు పట్టుకుని డప్పు చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తుండగా.. తమ గ్రామదేవతలైన పోలేరమ్మ, మారెమ్మ, డొంకలమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మగా పిలిచే గ్రామ దేవతలకు బోనంని,సాకని సమర్పిస్తారు.
ఆషాఢ మాసంలో బోనాల సమయంలో మహంకాళి అమ్మవారిని పూజిస్తారు.. ఆమె ఆవతారం రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది అందుకే అమ్మవారిని శాంతపరచడానికై ఇలా చేస్తారు. ఈ వర్షకాలంలో పూర్వకాలంలో గ్రామాల్లో ప్రజలు కలరా, ప్లేగు, మశూచీ వంటి వ్యాధులతో మరణించేవారు... ఎంతలా అంటే.. ఆ వ్యాధుల దాటికి గ్రామాలకు గ్రామాలే స్మశానాలుగా మారిపోయేవి... అప్పుడు ప్రజలు వాటి భారినుంచి అమ్మవారు కాపాడే వారని నమ్మేవారు. అందుకే ఇప్పటికి కూడా వర్షాకాలం ప్రారంభంకాగానే..వేపాకు నీళ్లు, పసుపు నీళ్లను చాలా మంది తమ ఇంటి చుట్టుపక్కల చల్లుతుంటారు. ఇది యాంటి బయోటిక్ గా పనిచేయడంతోపాటు, వైరస్ లను సమూలంగా నిర్మూలిస్తాయి. అంతేకాకుండా.. అమ్మవారు ఇంట్లో, గ్రామంలో చెడు గాలులు, చెడు ప్రభావాలను దూరం చేస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు తమ పుట్టింటికి వెళ్తుంటారని నమ్ముతారు.. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో పార్వతిదేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. పూర్వకాలంలో అయితే ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు కూడా. కానీ కాలంతో పాటు మారుతూ... దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. బోనం మోస్తూ... డఫ్పుల శబ్దల మధ్య జాతరగా వెళ్తుంటే... కొందరు మహిళలకు అమ్మవారు ఆవహిస్తారు... దీనినే పూనకం అని కూడా అంటారు.
ఈ బోనాల పండగను వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే జరుపుకుంటున్నారు. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఏడుకోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించాడట. ఆయనే అక్కడ తొలి బోనం సమర్పించినట్లు చరిత్ర చెబుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే...
సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి చెప్పుకోవాలి.. ఈ ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది.
ఆ తరువాత కాలంలో 1869వ సంవత్సరంలో హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి చాల దారుణంగా వ్యాపించింది.. దీని దాటికి ఎక్కడ చూసిన అందరు చనిపోతూ.. ఉంటే ఆ వ్యాధి ఉన్న గ్రామ ప్రజలు వారి గ్రామదేవతలకు పూజలు జరిపించి బోనం ఎత్తారు అని చరిత్ర చెబుతుంది.ఈ బోనాలు పండుగ చేయ్యడం వల్ల హైదరాబాద్‌లో ప్లేగు తగ్గిపోయింది. అందుకే అప్పటి నుంచి ప్రజలు ఈ ఆషాడంలో గ్రామదేవతను పూజిస్తారని... వారిని ఆనంద పెట్టడం కోసం బోనాలు చేస్తారని చరిత్ర. ఇలా అప్పటినుంచి హైదరాబాదులో బోనాల పండుగ కొనసాగుతుంది. అలాగే నిజాం ప్రభువుల కాలంలో కూడా ఈ పండుగ ఘనంగా జరిగేది.
నిజాం ప్రభువులు, కుతుబ్ షాహీల కాలంలో కూడా బోనాల పండుగను నిర్వహించారని... ముస్లింలు సైతం ఈ బోనాల పండుగను జరిపేందుకు వారు పూర్తిగా సహకరించేవారని చెప్తుంటారు. అందుకు అప్పటి కాలం నుంచి గోల్కొండలోని జగదాంబ అమ్మవారి ఆలయంలో ఈ బోనాలు ఘనంగా చేస్తున్నారు. అయితే హైదరాబాదులోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైందిగా ప్రసిద్ధి గాంచింది. అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతరు. పురాణాల ప్రకారం ఏడుగురు అక్కాచెల్లెళ్ల అమ్మవార్ల తమ్ముడే పోతురాజు. ఈ పోతురాజుతోనే జాతర సంబురాలు మొదలవుతాయి.
బోనాల జాతరలో చివరి ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున మాతంగీశ్వరీ ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది.. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చివరగా ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి మూసీనదిలో నిమజ్జనం చేస్తారు.
ఇలా తెలంగాణల జరుపుకునే ప్రతి ఒక్క పండుగకూ ఒక చార్రిత్ర ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా ఈ పండుగలుంటాయి. డప్పులు, తాళాల మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆడోళ్లు. ఈ పండుగకు దేశవిదేశాల్లోనూ ఒక పేరుంది. ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా జరుపుకుంటారు.
What's Your Reaction?