తెలంగాణకు హ్యాండిచ్చిన మోడీ!సపోర్ట్ చేస్తేనే నిధులు - లేదంటే లేదా? ఏపీకి నిధుల వరద!!

బడ్జెట్లో కేటాయింపుల కోసం రేవంత్ చాల ప్రయత్నాలు చేశారు కానీ.. నరేంద్రుడు మాత్రం కరుణించ లేదు కాదా... కనీసం మొత్తం బడ్జెట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణా ప్రస్తావనే తీసుకు రాలేదు.Sri Media News

Jul 24, 2024 - 17:12
 0  20
తెలంగాణకు హ్యాండిచ్చిన మోడీ!సపోర్ట్ చేస్తేనే నిధులు - లేదంటే లేదా? ఏపీకి నిధుల వరద!!

తెలంగాణ ప్రభుత్వానికి తొలి బడ్జెట్ లోనే షాక్ ఇచ్చింది కేంద్రం. మొన్న రైల్వే, నేడు సాధారణ బడ్జెట్ లో మెండి చేయ్యి చూపించింది. తెలంగాణ ప్రభుత్వం ఇక సొంత ప్రణాళికపై అధార పడటం తప్ప....చేసేది ఏమి లేదని తేలిపోయింది. బడ్జెట్లో తెలంగాణాకు అవసరమైన డిమాండ్లన్నింటినీ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మూడుసార్లు నరేంద్రమోడిని కలిసి చెప్పిన... ఇతర కేంద్రమంత్రులను చాలాసార్లు కలిసి వినతిపత్రాలను అందించిన ప్రయోజనం లేకుండా పోయింది. బడ్జెట్లో కేటాయింపుల కోసం రేవంత్ చాల ప్రయత్నాలు చేశారు కానీ.. నరేంద్రుడు మాత్రం కరుణించ లేదు కాదా... కనీసం మొత్తం బడ్జెట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణా ప్రస్తావనే తీసుకు రాలేదు. జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలకు కేంద్రం .. మొండి చెయ్యే చూపించింది.

ఈ సారైనా తెలంగాణకు విభజన హామీలు, నిధులు దక్కుతాయని ఎదురుచూసిన తెలంగాణ ప్రజలకు.. నిరాశే మిగిలింది.కేంద్ర సంస్థలు, నేషనల్ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లాంటివాటి ఏర్పాటుకు  ప్రకటనలు రాలేదు. తెలంగాణా తరఫున గెలిచిన బీజేపీ నాయకులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కేంద్రమంత్రులుగా ఉన్న ప్రయోజనం కనిపించలేదు. దీంతో తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.. ఇద్దరు కేంద్రమంత్రులు, ఆరుగురు ఎంపీలు తెలంగాణా ప్రయోజనాల విషయంలో ఏమిచేస్తున్నట్లు ?  అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు ఎక్కడ? అని నిలదీస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌‌‌లో తెలంగాణకు సంబంధించిన ఏకైక అంశం హైదరాబాద్‌‌ – బెంగళూరు ఇండస్ట్రియల్‌‌ కారిడార్‌‌. దీనికి ఆర్థిక తోడ్పాటునందిస్తామని కేంద్రం వెల్లడించింది. ఇది కూడా ఏపీకి మేలు చేసేందుకేననే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర కోస్టల్‌‌ ఏరియాకు బ్యాక్‌‌ రీజియన్‌‌ గ్రాంట్స్‌‌ అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర.. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇదే కోటాలో నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని  పట్టించుకోలేదు... పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఏఐబీపీ స్కీమ్లో కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

ఐటిఐఆర్, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరి, ఐఐటి, రీజనల్ రింగ్ అభివృద్ధికి నిధులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాలనే డిమాండ్లను రేవంత్ వినిపించారు కాని కేంద్రమంత్రులు, ఎంపీలు మాత్రం నోరెత్తలేదు. తెలంగాణా అభివృద్ధికి కేంద్రం అంత చేస్తోంది ఇంతచేస్తోందని చెప్పే కిషన్ రెడ్డి కూడా బడ్జెట్ గురించి మాత్రం ఏమీ మాట్లాడటంలేదు.

కేంద్రం ప్రవేశపెట్టిన  బడ్జెట్ ప్రకారం  ఈ ఆర్థిక సంవత్సరం 2024–25లో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాలో రూ.26,216  కోట్లు రానున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే కేంద్ర పన్నుల వాటా రూ.2 వేల కోట్లపైనే ఎక్కువ వస్తుంది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్‌‌‌‌ల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు 12.47 లక్షల కోట్లను పంపిణీ చేస్తుంది. అందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102% నిధులు.. అంటే రూ.26,216 కోట్లు తెలంగాణకు వస్తాయి. అంటే ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతోపాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌‌‌‌ల నిధులు మాత్రమే రాష్ట్రాలకు అందుతాయి.

దీంతో తెలంగాణ ప్రజలు కేంద్రంపై గుర్రుమని ఉన్నారు. తెలంగాణా విషయంలో నరేంద్రమోడి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జనాలు అంగీకరిస్తున్నారనే చెప్పాలి. కేంద్రనికి రేవంత్ పది డిమాండ్లు ఇచ్చినపుడు అందులో అన్నీ కాకపోయినా కనీసం రెండు మూడింటి విషయంలో అయినా సానుకూలంగా స్పందించాలి కదా ? బడ్జెట్లో వాటికి కేటాయింపులు చూపించాలి కదా. అపుడే తెలంగాణాపై మోడి ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనే విమర్శలకు ఫులిస్టాప్ పెట్టినట్లవుతుంది. కాని మోడి ప్రభుత్వం అలాంటి ఆలోచన చేసినట్లు కనిపించటంలేదు. అందుకనే బడ్జెట్లో తెలంగాణాను పూర్తిగా పక్కనపెట్టేసింది. మరిపుడు కిషన్, బండి ఎలా సమర్ధించుకుంటారు ? 2029లో అధికారంలోకి వచ్చేస్తామని తరచూ చెప్పుకుంటున్న కిషన్, బండి, లక్ష్మణ్ బీజేపీ నాయకులు ఇపుడు జనాలకు ఏమి సమాధానం చెబుతారు ?

బడ్జెట్ విషయంలో ఏపీ, బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూసిందనే వాదన కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించడం లేదు కేంద్రం. రాజధాని అమరావతి కోసం, పోలవరంతో, పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పిన కేంద్రం. తెలంగాణ పేరు కూడా పలకలేదు.. దీంతో ఆంధ్రప్రదేశ్‌‌కు, బీహార్‌‌కి మాత్రమే ప్యాకేజిలు ఇచ్చి.. మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం అని విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. సపోర్ట్ చేస్తేనే నిధులు- లేదంటే లేదు అనే వైకరిలో కేంద్రం తీరు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కేంద్రం ఏపీ రాజధాని నిర్మాణానివకి 15వేల కోట్ల రుపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తామని చెప్పింది. ఏపీలో ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కోసం విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్‌- బెంగుళూరు కారిడార్ లోని ఓర్వకల్ నోడ్‌‌కు అదనపు కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపింది. కొప్పర్తి, ఓర్వకల్లు కారిడార్‌లలో పారిశ్రామిక అభివృద్ధి కోసం విద్యుత్, రోడ్, వాటర్ సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తామని కూడా హామి ఇచ్చింది.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో ప్రత్యేక సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం.

కాగా.. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపించిందని.. తెలంగాణకు జరిగిన అన్యాయం పై అసెంబ్లీలో కేంద్రం తీరుపై నిరసన తీర్మానాలు చేస్తామని చెప్పారు రేవంత్. అయితే ఈ ప్రకటన ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ఎందుకంటే నిరసన తీర్మానానికి మద్దతు ఇవ్వటానికి బీఆర్ఎస్ రెడీగా ఉంటుందా అనేది తెలియాలి. బడ్జెట్లో తెలంగాణాకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే కేటీయార్, హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కాబట్టి నిరసన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతిస్తుందనే చెప్పవచ్చు. అయితే సభలో బీజేపీ సభ్యులు ఏమిచేస్తారో చూడాలి. పార్టీపరంగా నిరసన తీర్మానాన్ని అడ్డుకుంటారా ? లేదా వేచి చూడాలి.

నిజం చెప్పాలంటే.. బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మోదీ చంద్రబాబు, నితీష్‌లను సంతృప్తి పర్చడానికి ప్రయత్నించారనే చెప్పాలి. ఎందుకంటే.. మోదీ 3.O ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తుంది టీడీపీ, జేడీయులే. ఈ వాస్తవాన్ని గ్రహించిన మోదీ.. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ, జేడీయులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశాడనే చెప్పాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow