ప్రత్యేక హోదా అవసరమేనా? హోదా కోసం కేంద్ర పెట్టిన కండిషన్స్? హోదాతో వచ్చే ప్రయోజనాలు?
నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచింది మీరే కదా అని బీజేపీని నిలదీస్తే... ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబే ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారని బీజేపీ చెబుతుంది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. Sri Media News
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి విభజన హామీల్లో చాలా కీలకమైనది ప్రత్యేక హోదా అంశమే. ఉమ్మడి రాష్ట్రం విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని లోక్‌సభ వేదికగా అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ దానికి మద్ధతిచ్చినా, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. ఈ అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా ఇది ముగిసిపోయిన అధ్యాయమని, ప్రత్యేక హోదా ఇవ్వకున్నా రాష్ట్రానికి కావాల్సిన అన్నీ చేసామని సన్నాయి నొక్కులు నొక్కుతుంది కేంద్రం.
ఇప్పుడు ఎవరైనా... నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచింది మీరే కదా అని బీజేపీని నిలదీస్తే... ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబే ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారని బీజేపీ చెబుతుంది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో మోడీ పుట్టడం భారతదేశం చేసుకున్న అదృష్టం అన్నస్థాయిలో మాట్లాడిన పవన్ ప్రత్యేక హోదాపై మాట్లాడాల్సిందే..
అయితే... ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అనే మాటకు బలం చేకూర్చేలా ఐదు అర్హతలను తెరపైకి తెచ్చింది కేంద్రం. అందులో మొదటిది... కొండలు, పర్వతాలు, కఠినమైన క్లిష్టమైన భూభాగం ఉన్న ప్రాంతాలు ఉండాలి. ఇక రెండవది... తక్కువ జనసాంద్రత లేదా అత్యధిక గిరిజన జనాభా కలిగి ఉండాలి. మూడవది... పక్క దేశాలతో సరిహద్దు కలిగిన ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు అయ్యి ఉండాలి. నాలుగవది... ఆర్థిక, మౌలిక వసతుల లేమి.. పారిశ్రామిక వెనుకుబాటుతనం కలిగిన రాష్ట్రాలు అయ్యి ఉండాలి. అయిదవది... రాష్ట్ర ఆదాయం అత్యల్పంగా ఉండాలి.
ఇలా ఈ ఐదు అర్హతలూ కలిగి ఉంటేనే ప్రత్యేక హోదాకు అర్హత అని పార్లమెంట్‌లో ఎన్డీయే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అందువల్ల బీహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. సో.. ఇక ఏపీకి కూడా పైనున్న అర్హతలు లేవు కాబట్టి.. బీహార్‌కు ముఖం మీద చెప్పి, అదే సమాధానాన్ని అన్వయించుకోమని ఏపీకి కూడా చేప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం ఏపీకి చెందిన చంద్రబాబు.. బీహార్‌కు చెందిన జేడీయూ ఈ విషయం అందరికి తెలిసిందే.. వీరిద్దరూ పక్కకు తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుంది.. ఇదే సమయంలో.. ఈ రెండు రాష్ట్రాల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. ఏపీకైతే... బలమైన ప్రామిస్‌లే ఉన్నాయి. అయినప్పటికి కేంద్రంలో చక్రం తిప్పాల్సిన చంద్రబాబు.. మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్‌ప్లాఫ్ అయ్యారని టాక్ వినిపిస్తుంది.
కాగా.. ప్రత్యేకహోదా తెస్తామని... ఇస్తామని గత ఎన్నికల్లో ఒక్క కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీలు ప్రచారం చేయలేదు. జగన్ మేనిఫెస్టోలో పెట్టిన 2019లో మెడలు వంచకుండా తానే వంచి వచ్చారు. తెలుగుదేశంపార్టీ అసలు హోదా ప్రస్తావన తీసుకు రావడం లేదు . అది అసలు అసాధ్యమని దాని గురించి పట్టించుకుంటే... విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లవుతుందని రాష్ట్రానికి వీలైనంత ఆర్థిక సాయం తెచ్చుకోవడమే ముఖ్యంగా చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం. ప్రజల్లో కూడా దీనిపై విరక్తి వచ్చింది. రాజకీయ పార్టీలు తమలో ఉన్న ప్రత్యేకహోదా ఎమోషన్ తో ఆటలాడుకున్నాయని వారు భావించారు. అందుకే ఇప్పుడు ఎవరైనా ప్రత్యేకహోదా అన్నా పట్టించుకోవడంలేదు. ఏ విధంగా చూసినా ఇప్పుడు హోదా అనేది ముగిసిన అధ్యాయమే అవుతుంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాల విషయానికి వస్తే... రాష్ట్రానికి కేంద్రం మెరుగైన సదుపాయాలు అందించడానికి గ్రాంట్ల రూపంలో ఆర్థికసాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలకు ఇస్తున్న ఫండ్స్‌లో ముప్ఫయి శాతం నిధులను అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే అందిస్తారు. మిగిలిన 70 శాతం నిధులను ఆ తరువాత ఇతర రాష్ట్రాలకు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణం కింద ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు ఇస్తారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది.
పరిశ్రమలు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే వారికి అన్ని విధాలా రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తారు. రుణాల చెల్లింపు సమయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుంది. రుణాల చెల్లింపులను వాయిదా వేస్తారు. అవసరమైతే కొత్తగా మరికొన్ని రుణాలను కూడా అందచేస్తుంది. ప్రత్యేక హోదా రాకపోతే ఈ ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లే. దీనికి బదులుగా ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా ఆ లాభం ప్రత్యేక హోదా గుర్తింపు వల్ల కలిగే ప్రయోజనాలతో సమానం కాదు.
ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని.. పోలవరం ప్రాజెక్ట్ సత్వర నిర్మాణానికి పూర్తి సాయం అందిస్తామని కూడా ఆమె తెలిపారు. ఇక ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన అంశంగా మారింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
అంతేకాదు.. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి కూడా ఏపీకి ప్రత్యేక సహాయం చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని... విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఉన్న నోడ్ లకు ప్రత్యేక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ లకు మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే.. అమరావతి నిర్మాణానికి ఇస్తామన్న 15వేల కోట్ల రూపాయలు మినహా... మిగతావన్నీ వట్టి హామీలుగా మిగిలిపోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
What's Your Reaction?