వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు?వారాహి అమ్మవారి భర్త ఎవరు ?

మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరే వారాహి మాత.Sri Media News

Jul 23, 2024 - 12:28
 0  155
వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు?వారాహి అమ్మవారి భర్త ఎవరు ?
Goddess Varahi

వారాహి దేవత యజ్ఞ స్వరూపం, దశ మహా విద్యలలో ఈమే కనిపించదు. ఈమె పార్వతీ దేవి మాతృకాగా పురణాలు చెబుతున్నాయి. వారాహి దేవి యోగ సిద్ధికరి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రి సమయంలో మాత్రమే పూజిస్తారు. ఉదయం ఈ అమ్మవారి ఆలయాలు మూసి వుంటాయ్. వారాహి అమ్మవారిని రాత్రి మాత్రమే ఎందుకు పూజిస్తారు, వారాహి అమ్మవారు ఎలా జన్మించారు ? వారాహి అమ్మవారి భర్త ఎవరు ? వీటిని సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.

దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించడం కోసం వారాహీ మాతృక సృష్టించబడింది. రక్తభీజుడనే రాక్షసుడు దేవతలను, ప్రజల్నిబాగా హింసిస్తుండేవాడు. అప్పుడు దేవతలందరూ అమ్మవారి దగ్గరికి వెళ్లి సహాయం కోరుతారు. పార్వతీ దేవి ఉగ్రరూపంతో రక్తభీజుడిని అంతం చేయడానికి వెళ్తుంది. కానీ రక్తభీజుడిని అంతం చేస్తున్నప్పుడు రక్తభీజుడి ఒక్కో చుక్క రక్తం నేలమీద పడినప్పుడు మరొక రక్తభీజుడు ఉద్భవిస్తాడు. దీంతో ఇలా చాలా మంది రక్తభీజులు ఉద్భవిస్తారు. వేల మంది రక్తభీజులు రావడంతో వారిని చంపడం అమ్మవారికి కష్టం అవుతుంది. అప్పుడు పార్వతి మాత తన దేహం నుంచి సప్త మాతలను సృష్టించగా... వారాహి అమ్మవారు తన దంతాలతో రక్తభీజులందరినీ అంతం చేస్తుంది. ఇలా ప్రతి సప్త మాతృకా పార్వతి మాతకు సహాయం చేస్తారు. చివరకు వీరి సహాయంతో పార్వతి మాత రక్తభీజుడిని చంపుతుంది.

అలా కొంత కాలం తరువాత హిరణ్యాక్షుడనే రాక్షసుడు వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. దీంతో అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతుంది. దానికి హిరణ్యాక్షుడు... నాకు అమరత్వం కావాలి అని అడుగుతాడు. కుదరదని వారాహి అమ్మవారు చెబుతుంది. దీంతో నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి వీలు లేని వరం ఇవ్వు. నేను నీ భక్తున్ని కాబట్టి నువ్వు నన్ను చంపవద్దు అని హిరణ్యాక్షుడు అంటాడు. దానికి అమ్మవారు సరే అంటుంది.

ఇక హిరణ్యాక్షుడు రెచ్చిపోతాడు. వారహి మాత ఇచ్చిన వరాన్ని అండగా చూసుకొని భూలోకంలో ఎంతో మందిని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడానికి వారాహి అమ్మవారి నుంచి వరాహ అవతారం ఉద్భవిస్తుంది.... ఇలా వారాహి అమ్మవారి నుంచి వచ్చిన అవతారమే వరాహ అవతారం. ఇలా అవతరించిన వరాహస్వామిలోకి వారహి మాత తన  స్త్రీతత్వన్ని పంపి హిరణ్యాక్షుడిని అంతం చేస్తుంది. మత్స్యపురాణం ప్రకారం శివుడి చెమటతో పుట్టిన అంధకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికిశివుడు పార్వతీ దేవిలోని వారాహి అమ్మవారిని తలచకున్నట్టు ఉంటుంది. దేవీ పురాణంలో వారాహి దేవిని వరహాజనని, ‘‘క్రితంత తనుసంభవ’’ అని వర్ణిస్తారు. అంటే... మృత్యుసమయములో వచ్చేశక్తి అని అర్ధం... ఈ శక్తినే యమశక్తి అని కూడా అంటారు.

కాశీ విశ్వేశ్వరుడుకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాగా..  క్షేత్రపాలికగా ఉగ్ర వారాహీ మాత ఉంటుంది. అమ్మవారు వరాహ ముఖం, ఉగ్రస్వరూపాల కలగలుపుగా దర్శనమిస్తుంది. కాశీలో... భూగర్భపు ఆలయంలో కొలువై, చక్రం, ఖడ్గం ధరించిన ఈ దేవికి రోజూ సూర్యోదయానికి ముందే.. అక్కడి పూజారి అభిషేకం, పూజ నిర్వహించి హారతి ఇచ్చేసి గర్భాలయం తలుపులు మూసేస్తారు. ఆ తరువాతే భక్తులకు అమ్మవారి దర్శనం మొదలవుతుంది.

గుడి తలుపులోని ఓ రంధ్రం నుంచి అమ్మవారి ముఖం, కింది రంధ్రం నుంచి చూస్తే.. అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. భక్తులు సమర్పించిన పుష్పాలను పూజారి భద్రపరచి, మరునాటి వేకువజాము పూజలో వాడతారు. అమ్మవారిని అలంకరించే వేళ.. పూజారి సైతం కళ్లకు గంతలు కట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో అమ్మవారిని గ్రామదేవతగా భావించి, కాశీ వాసులు విశేషంగా ఆరాధిస్తారు.

స్థలపురాణం ప్రకారం.. పూర్వం దుర్గాదేవి రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించేందుకు తన శరీరం నుంచి సప్త మాతృకలను సృష్టించగా, వారిలో ఒకరిగానే వారాహీ దేవి కూడా ఆవిర్భవించింది. ఈ వారాహీ దేవియే.. రక్తబీజుడి గుండెలపై కూర్చుని తన పదునైన దంతాలతో వాడిని సంహరించింది. ఇక.. కాశీఖండం గ్రంథం ప్రకారం.. శివుడు వారణాసి నగరానికి పంపిన 64 మంది యోగినులు.. ఆ నగరం నచ్చటంతో అక్కడే ఉండిపోయారట. వారాహీ దేవి కూడా వారిలో ఒకరని, నాటి నుంచి ఆమె నగరాన్ని కాచి కాపాడుతోందని నమ్మకం.

వారాహీదేవి.. రోజూ సూర్యాస్తమయం కాగానే ఆలయం నుంచి బయటికి వచ్చి.. నగరంలో సంచరించి, తిరిగి తెల్లవారుజాము వేళలకు ఆలయానికి చేరుకుని, విశ్రాంతి తీసుకుంటుందనీ, ఆ సమయంలోనే అమ్మకు పూజలు నిర్వహిస్తారని చెబుతారు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి కనుకనే ఆమె విశ్రాంతి సమయంలోనే దర్శనానికి అనుమతి ఉందనీ, మిగతా సమయాల్లో ఆమె ప్రశాంతతకు భంగం కలగకుండా ఆలయాన్ని మూసివేస్తారని చెబుతారు. పేరుకు ఉగ్రరూపమే అయినా.. అమ్మ తన భక్తులను కన్నతల్లిలా ఆదరిస్తుందని ప్రతీతి. పాండవులు కూడా అమ్మవారిని కొలిచి, ఆమె ఆశీర్వాదం పొందారని పురాణ కథనం. ఇక.. అమ్మవారిని నేరుగా చూడలేకపోయినా.. భక్తులు మనసులో తలచుకుని కొలచినా ఆశీర్వదిస్తుందని ప్రతీతి.

పూర్వం ఈ ఆలయంలో అమ్మవారికి నరబలులు ఇచ్చేవారనీ, కాలక్రమంలో అది రక్తాభిషేకంగా మారిందనీ, ప్రస్తుతం ఇక్కడ సాత్విక పూజ మాత్రమే ఉందని చెబుతారు. లక్ష్మీదేవి స్వరూపంగానూ కొలిచే వారాహీ దేవిని బౌద్ధులు వజ్ర వారాహి అని పిలుస్తారు. దేశంలో పలుచోట్ల అమ్మవారి ఆలయాలున్నా.. పూజలు మాత్రం రాత్రిపూట మాత్రమే చేయటం సంప్రదాయంగా వస్తోంది. మరి ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఆ రోజులలో అమ్మవారిని సేవిస్తే.. భక్తులను కటాక్షిస్తుందని నమ్ముతారు.

వామన పురాణం ప్రకారం.. అమ్మవారు వారాహి అమ్మవారిని వీపు భాగం నుంచి పుట్టించినట్టుగా వుంది. రాక్షసులను అంతం చేయడానికి వారాహి అమ్మవారు వస్తారు. శివుడి నుంచి అష్టభైరవులు ఉద్భవిస్తారు. వీరిలో ఒకరైన ఉన్మత్త భైరవుడే వారాహి అమ్మవారి భర్తగా శాస్త్రం చెబుతోంది.

అంతేకాదు అమ్మవారు.. లలితాదేవికి సైన్యాధిపతి... అందుకే వారహిమాత ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. వారహి మాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగ్రుతం అవుతుందనీ.. నమ్మకం. వారాహదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం. వారాహదేవికి ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవరాత్రులు జరుపుతారు. వివిధ ప్రాంతాలలో వీటిని ఆషాఢ నవరాత్రి అని, గుహ్యనవరాత్రి, గుప్త నవరాత్రి అని అంటారు. ఒరి స్సాలోని చౌరాసీలోని వారాహి ఆలయంలో, బెంగళూరులోని ఉల్సార్‌లో ఉన్న మహావారాహి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow