ఎంత వల్గర్‌గా మాట్లాడితే అంత ఫేమస్..
ఎంత క్రింజ్ చేస్తే.. అంత పాపులారిటీ.. ఎంత వల్గర్‌గా మాట్లాడితే అంత ఫేమస్.. ఎన్ని బీప్ డైలాగ్స్ యూజ్ చేస్తే.. అంత క్రియేటవిటీ ఉన్నట్లు వారిని ఫేమస్ చేయటమే కాదు.. ఏకంగా పెద్ద పెద్ద ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేసేస్తున్నాయి కూడా. ఎన్ని బూతులు మాట్లాడితే అంత పాపులారిటీ.. ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే అంతమంది ఫాలోవర్స్. అటు పేరుకి పేరు డబ్బుకి డబ్బు వస్తుండటంతో.. నోటికొచ్చింది పేలుతూ.. సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు.
కళ్లు మూసుకునిపోయి..
ఇలా నోటికి హద్దు అదుపు లేకపోవడంతో.. కళ్లు మూసుకునిపోయి.. తండ్రీ కూతుళ్ల బంధం గురించి నోటికొచ్చినట్టు వాగిన సోషల్ మీడియా పశువుపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. అతనే పి హనుమంతు అనే యూట్యూబర్. ఈ మధ్య ఇతను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఎలాగంటే.. తనలాంటి మెంటాలిటీ ఉన్న కొంతమంది పోగేసుకుని వాళ్లతో మాట్లాడుతూ.. ఎదుటి వాళ్లపై నోటికొచ్చినట్టు పేలుతుంటారు.
హేళనలు, బాడీ షేమింగ్, బూతులు, వల్గారిటీ, డబుల్ మీనింగ్ మాట్లాడుతూ.. దీనికి డార్క్ కామెడీ అనే పేరుని పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ... ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. అతడి బ్యాచ్ హేయమైన, నీచమైన కామెంట్స్ చేశారు.. ఈ వీడియోపై హీరో సాయి దుర్గా తేజ్ అందరి కంటే ముందుగా స్పందించాడు. అతడి మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ - తెలంగాణ డీజీపీలు స్పందించారు. దీంతో ఒక్కసారిగా ఈ హనుమంతు ఎవరా అని చర్చ మెుదలయ్యింది. అసలు అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. ఫ్యామిలీలపై డార్క్ జోక్స్ వేసే ఈ నీచుడికి.. ఫ్యామిలీ లేదా.. ఉంటే వారు ఎవరు అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఈ నీచుడికి.. ఫ్యామిలీ లేదా..
పి హనుమంతు గురించి చెప్పాలంటే ముందుగా పండిత పుత్ర పరమ శుంఠ అనే సామెతని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే.. ఈ పి.హనుమంతు ఓ కలెక్టర్ గారి అబ్బాయి. ఐఏఎస్ అధికారి అరుణ్‌కుమార్ రెండో కొడుకే హనుమంతు. ఈయన ఏపీ ప్రజలకు బాగా తెలుసు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా అరుణ్ కుమార్ కూడా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు. అరుణ్ కుమార్ కుమారుడే ప్రణీత్. ఆయన గత కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు. ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబరే. అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయిన 'ఏ జూడ్' ఛానల్‌ను ఓనర్ అజయ్. హనుమంత్‌కు అజయ్ అన్నయ్య.
వీడియో విషయానికి వస్తే..
ఇక వీడియో విషయానికి వస్తే.. హనుమంతు అండ్ అతని సోకాల్డ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి లైవ్‌ని యూట్యూబ్‌లో స్ట్రీమ్ చేశారు. వీరి గ్యాంగ్ మెుత్తం డార్క్ కామెడీ పేరుతో ప్రతి వీడియోపై వల్గర్ కామెంట్స్ చేస్తూ.. నీచంగా మాట్లాడటమే వీరి పని. ఆ వీడియోలో ఎవరున్నా.. సరే వారికి అనవసరం.. ప్రతి అంశాన్ని సెక్స్‌కి రిలేట్ చేస్తూ మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారు. ఆ వీడియోలో ఓ చిన్నపాప, తండ్రి ఉన్నారు. మెుదట తండ్రి కోపంగా బెల్ట్ తీసి.. ఆ తరువాత ఆ బెల్ట్‌పై కూతుర్ని కూర్చోబెట్టి ఊయలలా చేసి ఆడించాడు. అది ఎంత హార్ట్ వార్మింగ్ వీడియో.. ఓ తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పగా చూపించారు. తండ్రికి ఎంత కోపంలో ఉన్నా.. కూతురు ముఖం చూడగానే అదంతా మర్చిపోయి.. ఆడిస్తాడు అనే భావం వచ్చేలా ఉన్న వీడియోని కాస్తా.. పోర్న్ వీడియోలా చేసేశారు ఆ దుర్మార్గులు వారి కామెంట్స్‌తో.
అంతేగాకుండా.. ఆ పాపకి ఏ రైమ్ బాగా నేర్పిస్తాడురా వాళ్ల డాడీ అంటే.. మరొకడు ఓపెన్ యువర్ మౌత్ హ.. హ.. అని వేరే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ గ్రూప్‌లో ఓ దరిద్రుడు అయితే ఆ వీడియోలో ఫాదర్ బెల్ట్ విప్పటం చూసి ఫస్ట్ లైక్ చేశాడు అంట.. కానీ తరువాత కూతుర్ని ఊయల ఊగించటం చూసి.. వెంటనే లైక్ బటన్ తీసేశాడట.. అంటే ఆ ఫాదర్.. ఆ కూతురిపై రేప్ చేస్తాడనుకొని వీడియోని లైక్ చేశాను అన్న అర్థం చెప్పాడు. నిజంగా ఇటువంటి చెత్త మెంటాలిటీతో ఉన్న వీరు కుటుంబంతోనే లైఫ్‌ని స్పెండ్ చేస్తున్నారా అన్న డౌట్ రాకమానదు.. వీరి కామెంట్స్ చూస్తే. అంటే వీరి దృష్టిలో ప్రతి బంధం కూడా ఓ సెక్స్ రిలేటెడ్ రిలేషన్ ఉంటుంది.. వాటిపైనే జోక్స్ వేస్తూ.. శునకానందం పొందుతారు.
ఈ బ్యాచ్ ఇటువంటి వీడియోస్ చేయటం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. వీరికంటూ ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది.. అందులో కూడా ఇదే డార్క్ కామెడీ పేరిట వల్గర్ కామెంట్స్, బూతులతో కూడిన పోస్టులు చేశారు.. చేస్తున్నారు కూడా. అయితే ఈ పైశాచిక ఆనందం బాగా వైరల్ కావడంతో.. అతనికి వ్యూస్ పెరగడమే కాదు.. సుధీర్ బాబు హీరోగా నటించిన హరోంహర సినిమాలో కూడా అవకాశం ఇచ్చారంటే.. ఇలాంటి పశువుల్ని ఏ రేంజ్‌లో ఎంకరేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. సెహరి సినిమా ఈవెంట్‌కి ఇతన్ని తీసుకొచ్చి యాంకర్ సుమతో పాటు మైక్ అందించారు. ఆ టైంలోనూ నోటికొచ్చినట్టు వాగాడు. ఇతన్ని పాపులర్ చేసింది సోషల్ మీడియా వాళ్లే కాదు.. సినిమా వాళ్లు కూడా అని చెప్పుకోవచ్చు.
'హరోం హర'లో ప్రణీత్ హనుమంతు తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు. 'హరోం హర' కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదల అయిన ఒరిజినల్ ఫిల్మ్ 'మై డియర్ దొంగ'లో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు. 'కీడా కోలా' విడుదలకు ముందు దర్శక నటుడు తరుణ్ భాస్కర్ చేసిన ప్రమోషనల్ వీడియో గుర్తు ఉందా? కామెడీ కింగ్ బ్రహ్మానందం గెటప్స్ రీ క్రియేట్ చేశారు. ఆ వీడియో వెనుక సృష్టికర్త ప్రణీత్ హనుమంతే. అంతే కాదు.. ప్రణీత్ హనుమంతు కొన్ని సినిమాల విడుదలకు ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు సైతం చేశారు. 'హాయ్ నాన్న' విడుదలకు ముందు నానితో, 'భజే వాయు వేగం' విడుదలకు ముందు కార్తికేయ గుమ్మకొండతో ప్రణీత్ హనుమంతు స్పెషల్ వీడియోస్ చేశారు. ఇలా తనకున్న సర్కిల్‌లో సోషల్ మీడియా నుంచి క్రమంగా సినిమాల్లో యాక్ట్ చేయటంతో పాటు హీరోస్‌తో కలిసి వీడియోలు చేయటంతో ప్రణీత్ హనుమంతుకి పాపులారిటీ వచ్చింది.
స్టార్టింగ్‌లో రోస్ట్ వీడియోస్ చేసి పాపులర్ అయిన ప్రణీత్.. క్రమంగా తనలోని ఉన్న వంకర బుద్ధితో డార్క్ కామెడీ వీడియోస్ చేయటం స్టార్ట్ చేశాడు. అమ్మా, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అనే భేదం లేకుండా ఆఖరికి హ్యాండీక్యాప్డ్ పీపుల్స్ పై కూడా డార్క్ కామెడీ చేయటం స్టార్ట్ చేశాడంటే.. హనుమంతుది బుర్ర.. లేదా బూతా అని అనిపించకమానదు.
సాయి ధరమ్ తేజ్ ట్వీట్....
ప్రణీత్ హనుమంతు తండ్రీ కుమార్తెల వీడియోపై చేసిన వల్గర్ కామెంట్స్.. హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయటంతో..అసలు వారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట ఎటువంటి ఎధవ పనులు చేస్తున్నారో ప్రపంచానికి అర్థం అయ్యింది.
"సోషల్ మీడియా ప్రపంచం చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయింది. దీన్ని నియంత్రించడం చాలా కష్టం.. కనుక మీరు మీ పిల్లల వీడియోలు లేదా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి కాస్త ఆలోచించండి. ఇది తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి. లేదంటే సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది మృగాలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాయి. వాళ్ల నుంచి పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనపై ఉంది. కాబట్టి దయచేసి మీ పిల్లల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి.. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తించే మృగాలకి ఎప్పటికీ బాధిత తల్లిదండ్రుల క్షోభ అర్థం కాదు." అంటూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ట్యాగ్ చేయటంతో పాటు డీజీపీలకు కూడా ట్యాగ్ చేశారు. దీంతో డార్క్ కామెడీ పేరిట హనుమంతు చేస్తున్న పాపం పండింది.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హనుంతుపై ఫైర్ అవుతున్నారు. అసలు తండ్రీ కూతుర్ల బంధాన్ని వంకర బుద్ధితో చూడాలని ఎలా అనిపించిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేగాకుండా హనుమంతు ఫ్యామిలీని సైతం ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్నారుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ బ్యూరో ప్రణీత్ హనుమంతుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసింది.. ఈ నెగిటివిటీని చూసిన హనుమంతు.. చివరికి అపాలజీ వీడియోని అయితే రిలీజ్ చేశాడు. కానీ అందులో కూడా తన వంకర బుద్ధిని చూపించుకున్నాడు.. తాను చేసింది కరెక్టే కానీ.. ప్రజలే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కామెంట్ చేశాడు. హద్దు దాటానని.. క్షమాపణలు చెప్పాడు. గత రెండు రోజులుగా తన పేరెంట్స్‌ను చాలామంది బూతులు తిడుతున్నారని.. వారిని దయచేసి వదలేయాలని తప్పంతా తనదే అన్నాడు ప్రణీత్. ఈ విషయంలో చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని క్లారిటీ ఇచ్చాడు.