బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్..

ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందటంతో ప్రస్తుతం వైసీపీ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. మా జగనన్న... అంటూ జగన్‌‌ నామస్మరణ చేసిన నాయకులు సైతం పార్టీని వీడుతున్నారు. Sri Media News

Jul 9, 2024 - 12:39
 0  3
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్..
big shock for siddarth reddy

 ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను సైతం వైసీపీ  కోల్పోవడంతో టీడీపీ- జనసేన- బీజేపీల్లో అవకాశం దొరుకుతుందేమో అని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఛాన్స్ దొరికిన వాళ్లు రెండో మాట లేకుండా పార్టీ కండువా మార్చేస్తుంటే... మాజీలు, కీలక, ముఖ్య నేతలు.. ద్వితీయ శ్రేణులు పెద్ద ఎత్తున అధికార టీడీపీలోకి జంప్ అయిపోతున్నారు. దీంతో పార్టీలో ఎప్పుడు ఎవరుంటారో.. జంప్ అయ్యేదెవరో తెలియని పరిస్థితి. ఈ జంపింగ్‌ల విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం చేతులెత్తేసిన పరిస్థితి. ‘ఉండేటోళ్లు ఉండొచ్చు.. పోయేవాళ్లను మనం ఏం చేయగలం.. ఎన్నాళ్లని ఆపగలం’ అని ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా చెప్పేయడంతో ఇక తట్టా బుట్టా సర్దేయడానికి సిట్టింగులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

 వైసీపీకి కర్నూలు జిల్లా కంచుకోట.. అటువంటి జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటుకే ఈ ఎన్నికల్లో పరిమితమైన పరిస్థితి. ఇక నందికొట్కూరు విషయానికొస్తే.. అంతా తనదే అంటూ ఇన్నాళ్లు షాడో ఎమ్మెల్యేగా ఉన్న యువనేత, మాజీ శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు హ్యాండిచ్చేశారు.. మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 18 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్ నెంబర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. మున్సిపాలిటీనీ అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్టు సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కాగా.. నంద్యాల ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్ కుమార్తె బైరెడ్డి శబరి గెలిచిన సంగతి తెలిసిందే.

అయితే.. నందికొట్కూర్ లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పీడ్‌‌కి పెదనాన్న రాజశేఖర్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. 2019 వైసీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు బైరెడ్డి  సిద్ధార్థ్ రెడ్డి . అంతేకాదు గత ఐదేళ్లు తమ ప్రభుత్వంలో నందికొట్కూర్‌‌కు రెండవ సీఎం అన్నట్టు అక్కడ రాజకీయలు నడిచాయి. ఆయన నాయకత్వంలోనే ఇక్కడ వైసీపీ మున్సిపలిటీ ఛైర్మన్ పదవిని దక్కించుకుంది.

అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత... బైరెడ్డి సొంత నియోజకవర్గంలో లీడర్లను నిలబెట్టుకోలేక పోతున్నాడు. ఇటువంటి బైరెడ్డి గురించి... వైసీపీ వారి ప్రభుత్వంలో ఓవర్‌ బిల్డప్ ఇచ్చింది?.. అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుతున్నాయ్. ఎంతలా అంటే.. యువనేత, రాష్రమంతా తిరిగి ప్రచారం చేసిన ఉడుకు రక్తం, బైరెడ్డి అంటే లెక్కే వేరులే.. ఇలా ఒకటా రెండా ఓ రేంజిలో వైసీపీ కార్యకర్తలు ఆయన్ను జాకీలేసి లేపారు. సీన్ కట్ చేస్తే.. రాష్ట్రం సంగతి దేవుడెరుగు, సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్లను నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు, కార్యకర్తలు నెట్టింట్లో ఆడేసుకుంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో సిద్ధార్థ్ రెడ్డి పెదనాన్న అయిన రాజశేఖర్ రెడ్డి మళ్లీ యాక్టీవ్ అయ్యారు. అయితే. ఎన్నికల్లో ఓటమి తర్వాత సిద్ధార్థ్‌ రెడ్డి సైలెంట్ అయ్యారు. కాగా ఈ చేరికల వ్యవహారంపై బైరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow