హైదరాబాద్‌లోని స్థిరాస్థులపై పూర్తి హక్కులు తెలంగాణవేనని రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకి తేల్చి చెప్పేశారు. స్థిరాస్తుల మీద హక్కులే లేవన్న రేవంత్ హైదరాబాద్ ఆదాయంపై హక్కులు కల్పించడానికి ఒప్పుకుంటారా..? అసలు విభజన హామీ కింద ఏయే అంశాలు వస్తాయి.. ఈ భేటీతో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయా.. తెలుసుకుందాం రండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. అయినా.. విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. గతంలో విభజన సమస్యలపై కేసీఆర్ - చంద్రబాబు, కేసీఆర్ - జగన్ మాట్లాడుకున్నా సమస్యలు పరిష్కారం జరగలేదు. ఈ క్రమంలోనే జరిగిన చంద్రబాబు - రేవంత్‌ల సమావేశం విభజన సమస్యలకు పరిష్కారం చూపుతుందా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి. 9, 10 షెడ్యూల్‌లోని అంశాలతోపాటు నదీ జలాల పంపిణీపై ప్రధానంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
పునర్విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మద్దతు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన శ్రద్ధచూపకపోవడం వల్ల అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి.
చట్టంలోని సెక్షన్ 93 లోని షెడ్యూల్ 13 ప్రకారం... 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. వాటిలో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. 1. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు 2. సమగ్రమైన ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 3. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, 4. విశాఖపట్టణంలోనూ, విజయవాడ–గుంటూరు–తెనాలి నగరాలలోనూ మెట్రోరైలు ఏర్పాటు చేయడం. ఇంకా మిగిలిన 4 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.
ఏపీలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 94(1) సెక్షన్ క్రింద కేంద్రప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవకపోవడం మరో ఇబ్బంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ఆమోద సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని ఆ నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఐదేళ్లు కాదు పదేళ్ల పాటు ఇవ్వాలని నాటి రాజ్యసభలో బిజెపి నాయకుడు ఎం.వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. విభజన తరువాతి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు లేవు. అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ప్రత్యేక హోదా వలన పారిశ్రామిక, పన్నులు రాయితీలు లభించి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని అనేక మంది భావించారు. 2014కు ముందు ప్రణాళికా సంఘం సిఫార్సులతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించి, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి 70 వేల కోట్ల లబ్ధి జరుగుతుందని ప్రకటించారు. ప్రత్యేక ప్యాకేజీ దగా అర్ధం కావటానికి ఆయనకు రెండేళ్లు పట్టింది.
ఇక జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు, దీక్షలు చేశారు. తనకు 25 మంది లోక్‌సభ సభ్యులను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రకటించారు. 22 మంది వైఎస్‌ఆర్ పార్టీ తరపున లోక్‌సభ సభ్యులుగా గెలుపొందారు. ప్రత్యేక హోదా సాధనలో పూర్తి వైఫల్యం చెంది, తమ వల్లకాదని చేతులు ఎత్తేశారు.
విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అనేక మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పొందుపరిచారు. రాష్ట్రంలో దుగ్గరాజపట్నం వద్ద దశలవారీగా నూతన భారీ నౌకాశ్రయాన్ని నిర్మించి మొదటి దశ 2018 కల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. కడప జిల్లాలో సమగ్ర, భారీ ఉక్కు కర్మాగారం సెయిల్ సహకారంతో నిర్మించాలి. విశాఖపట్నంలో నూతన రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఫీల్డ్ ముడి చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో రసాయన సముదాయాన్ని నెలకొల్పాలి. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణ అవకాశాలు పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు ర్యాపిడో రైలు, రోడ్డు అనుసంధానం చేయటానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నంలోనూ, విజయవాడ-గుంటూరు-తెనాలిలో మెట్రో రైలు సౌకర్యం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. 13వ షెడ్యూల్‌లో చేర్చిన మౌలిక వసతులు, పరిశ్రమలకు సంబంధించి ఒక్క అంశం కూడా అమలు జరగలేదు.
విభజన చట్టంలో సెక్షన్ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం కోసం కావలసిన సౌకర్యాలు సృష్టించటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇవ్వాలి. దీనికి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం రూ.42,935 కోట్లు అంచనా వేసి నివేదిక ఇచ్చింది. కేంద్రం కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడి రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమే అందించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూ సమీకరణ చేసి తాత్కాలిక రాజధాని భవనాలు మాత్రమే నిర్మించింది. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల వివాదాన్ని తెచ్చి అమరావతిలో రాజధాని నిర్మాణానికే ప్రయత్నించలేదు.
నదీ జలాల పంపిణీ...
విభజన సమస్యల్లో అన్నిటికంటే క్లిష్టమైనది నదీ జలాల పంపిణీ. గోదావరి నీటి విషయంలో చిన్నా చితకా సమస్యలు ఉన్నా, కృష్ణా నీటి విషయంలో తీవ్రమైన అభిప్రాయ బేధాలు ఉన్నాయి.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి సమస్యను తీర్చేందుకు గోదావరి జలాలను కృష్ణకు తరలించాలని 2020లో కేసీఆర్- జగన్ అనుకున్నప్పటికీ అది ముందుకు సాగలేదు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నీటిలో ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు.
కానీ వాస్తవంగా కృష్ణా నదికి తెలంగాణలో ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉంది. ఆంధ్రలో తక్కువ పరీవాహక ప్రాంతం ఉంది. దీంతో నదీ జలాల పంపిణీ సహజ సూత్రాల కింద తెలంగాణకు ఎక్కువ నీరు రావాలనేది ఆ రాష్ట్ర వాదన.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వాటాలోని మొత్తం నీటిలో 70 శాతం లేదా సుమారు 558 టీఎంసీలు తమకు రావాలని తెలంగాణ పట్టుబడుతోంది. దీనికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.
శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందు నుంచీ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తమకు రూ.7 వేల కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది
విద్యుత్ రంగానికి సంబధించిన సమస్య కూడా ఉంది. తెలంగాణ తమకు రూ.7 వేల కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఆంధ్రాయే తమకు 23 వేల కోట్ల వరకూ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆ లెక్కలు కూడా సరికాదని రెండు ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై ఆంధ్రా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది.
ఇక తాజాగా విభజన సమస్యలపై సమావేశమైన రేవంత్ రెడ్డి - చంద్రబాబు రెండు కమిటీలు వేయాలని నిర్ణయించుకోవడం మంచి పరిణామం. ఈ కమిటీల్లో ఒక్కటీ మంత్రుల కమిటీ కాగా, రెండోది అధికారులతో కూడిన కమిటీ. ఈ కమిటీల విధివిధానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మంత్రుల కమిటీలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఉంటారు. అధికారుల కమిటీలో రెండు రాష్ట్రాల సీఎస్‌లతోపాటు సీనియర్ IAS అధికారులు ఉండే అవకాశముంది. ఈ కమిటీలు రెండూ రెండు వారాల్లోగా పని చేయడం ప్రారంభిస్తాయి.
విజయసాయి రెడ్డి ట్వీట్
రేవంత్ రెడ్డి - చంద్రబాబు సమావేశం జరుగుతున్నప్పుడే వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. హైదరాబాద్ ఆదాయంలో వాటా అడగాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. అయితే.. ఇది సాధ్యమా..? అనేది ప్రశ్న. నెక్ట్స్ సీఎంల సమావేశంలో చంద్రబాబు - రేవంత్ రెడ్డి సమక్షంలో హైదారాబాద్‌లో వాటా అడగగలరా..? అడిగితే.. రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది..? అనేది ప్రధాన ప్రశ్న. హైదరాబాద్‌లోని భవనాలే ఇవ్వనని చెప్పిన రేవంత్.. హైదరాబాద్‌లో వాటా ఎలా ఇస్తారు..?2019 నుంచి 2024 వరకు ఏపీలో వైఎస్‌ఆర్ సీపీనే అధికారంలోకి ఉంది కదా..? కేసీఆర్‌తో జగన్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి కదా..? మరీ ఎందుకు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం.. హైదరాబాద్ ఆదాయంలో వాటా అడగలేదు..? ఈ ప్రశ్నకు విజయసాయి రెడ్డి సమాధానం చెబితే బాగుంటుంది.