కొందరు షిర్డి సాయి మూలాలు అన్వేషించే పనిలో ఉన్నారు. అయితే కొందరు షిర్డీ సాయి బాబాని ముస్లింగా చెప్తారు.. మరికొందరు హిందువు అని చెప్తారు.. శంకరాచార్య స్వామి స్వరూపానంద్ స్వామీజీ.. సాయి బాబా ఒక ముస్లిం అని.. సాయి బాబాని ఒక హిందూ దేవుడిలా పూజించటం తప్పు అని అంటారు.. హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం జైలుకైనా పోవటానికి సిద్ధం అంటూ శంకరాచార్య స్వామి స్వరూపానంద్ ఆ మధ్య చేసిన వ్యాఖ్యలతో.. అసలు సాయి బాబా హిందువు కాదా అని అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.. సాయి బాబాని ముస్లిం అని ఎందుకు అంటారు? దాని వెనుకున్న కారణాలు ఏంటి? సాయి బాబా హిందువా? ముస్లిమా తెలుసుకుందాం రండి.
భక్తుల ఆర్తనాదాలు విని.. వారి బాధలు చూసి బీభత్సం సృష్టిస్తున్న గాలి వానను ఆపినవాడు ఆయన, నీటితో దీపాలు వెలిగించి మహిమలు చూపినవారు షిర్డీ సాయిబాబా. ఎన్నో అద్భుతాలు చేసిన సాయిబాబా ఏ మతానికి చెందినవారు అనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతుంది.. ఎందుకంటే.. కొందరు హిందువులు ఆయన ముస్లిం అని చెప్తుంటారు.. మరి కొందరు హిందూ దేవుడిగా ఆరాధిస్తూ, పూజలు చేస్తుంటారు.
సాయి బాబా వస్త్రధారణ ఒక ముస్లింని పోలి ఉంటుంది.. ఎప్పుడూ తెల్లని దుస్తులలో, తలకి టోపీలా గుడ్డ కట్టకొని కనిపిస్తుండేవారు. దీన వల్ల ఆయనొక ముస్లిం అన్న నిర్థారణకు వచ్చేశారు. అయితే మనం ఏ కుటుంబంలో పుడతామో.. ఆ మతానికి చెందిన వారము అవుతాము.. ఇదే విధంగా.. సాయి బాబాకి కూడా వర్తిస్తుంది..
ఆయన పుట్టుక, జీవితంపై రెండు పుస్తకాలు రాశారు ఇద్దరు.. ఈ రెండు పుస్తకాలను హిందువులే రాశారు. ఒకటి శ్రీసాయి శతచరిత్ర.. దీనిని హేమంత్ పంత్ రాశారు. మరొకటి లైఫ్ ఆఫ్ సాయి బాబా.. దీనిని శ్రీ నరసింహా రాశారు. ఈ రెండు పుస్తకాల ప్రకారం.. సాయిబాబా తనకు బాగా దగ్గరైన భక్తులకు చెప్పిన ప్రకారం.. ఆయన మహారాష్ట్రలోని పత్రిలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సాయి బాబా ఐదేళ్ల ప్రాయంలో.. అతడిని.. ముస్లిం ఫకీరుకు ఇచ్చేశారు సాయి తల్లిదండ్రులు.. అయితే సాయి పదేళ్ల ప్రాయంలో ఉండగా ఆ ఫకీరు కన్నుమూశాడు.. అప్పుడు సాయి గోపాల్ రావు దేశ్‌ముఖ్ అనే వ్యక్తి పెంచాడు.. ఈయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఈ కారణంతోనే బాబా ఆధ్యాత్మికం వైపు ఆకర్షితుడయ్యాడని చెప్తారు..
పొడవాటి కఫనీ ధరించి తలకు పాగా వలె గుడ్డ కట్టుకొని దర్శనమిస్తుంటారు షిర్డీ సాయి.. ఎవరైనా ముస్లిం భక్తులు నైవేద్యం తెస్తే సంప్రదాయం ప్రకారం ఫాతిహా... అని మననం చేస్తూ అల్లాకు నివేదన చేస్తుంటారు.. కానీ షిర్డీ సాయి అయితే ఒక్కరోజు కూడా నమాజ్ చేసిన దాఖలాలు లేవు. నమాజ్ చేయకపోతేనేం... వేషధారణను బట్టి ఆయనొక ముస్లిమేనని ఎవరైనా వాదనకు దిగితే, ఇదిగో ఇటుచూడు అన్నట్లు తను ఉంటున్న మసీదుకి ద్వారకామాయి అనే పేరు పెట్టడమే కాకుండా ఆ మసీదు ముందు తులసికోటను స్థాపించి, మసీదు గోడలపై ప్రతిరోజూ దీపాలు వెలిగిస్తుండేవాడు సాయి బాబా..
ధ్యానంలో ఉండటం, ధునిలో ఒక్కొక్కటిగా సమిధలను వేస్తుండటం, ఏవో మంత్రాలను మంద్రస్వరంతో ఉచ్ఛరిస్తుండటం, రోజులో చాలా భాగం ఇతరులకు దూరంగా ఉంటూ ఏకాంతంలో గడుపుతుండటం, తనకు అంతరంగ భక్తులను మాత్రమే దగ్గరకు రానివ్వడం, తనకు నచ్చిన భక్తులతోనే కాసేపు మాట్లాడటం, భిక్షగా స్వీకరించిన పదార్థాలను మాత్రమే తినడం, తర్వాత ఆ భిక్షను తనతో ఉన్నవారందరితో పంచుకోవడం చేస్తూ ఉండే బాబా, మొక్కలకు నీళ్లు పోయడం, ద్వారకామాయి గోడలపై దీపాలు వెలిగించడం చేస్తుండేవారు.
ప్రతి విషయాన్ని రెండు కోణాలలో చూసేవారికి.. ఎప్పుడూ ఒక విషయం రెండు అర్థాలనే చూపిస్తుంది.. అలాగే సాయి బాబా విషయంలో కూడా.. నమ్మకం బట్టి.. ప్రతి మనిషి భావాలు మారిపోతాయి.. సాయి బాబాని హిందూ ముస్లిం మతాలకు చెందిన వారు పూజించటం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి.. సాయి బాబా పర్టిక్యులర్‌గా ఏ మతానికి చెందినవారు అని చెప్పటం అనేది చాలా కష్టం.. ఆయన పుట్టింది హిందూ కుటుంబంలో, ఊహ తెలిసినప్పటి నుంచి పెరిగింది ముస్లిం ఫకీరు వద్ద, లోకం పోకడ అర్థాన్ని తెలుసుకునే వయస్సులో ఓ వెంకటేశ్వర స్వామి భక్తుడి వద్ద పెరిగాడు.. దీనిబట్టి.. మర్థం చేసుకోవచ్చు.. ఆయన రెండు మతాల సారాలను అర్థం చేసుకొని.. తన భక్తులకు మంచిని ప్రభోధిస్తూ ఉండేవారని.
అయితే సాయిబాబా అసలు పేరు సైఫుద్ధిన్ బాబా అనీ,
ఫకీర్లను పర్షియన్ భాషలో “ సాయి” అని అంటారు అనీ ఆవిధంగా ఫకీర్ పేరు క్రమంగా “సాయి” గా మారింది అన్న ప్రచారం కూడా జరుగుతుంది..
ఈ మతాల మధ్య వైషమ్యాలను తొలగించటానికే అన్నట్లు సాయి బాబా ఎప్పుడూ సబ్‌కా మాలిక్ ఏక్ హై అంటూ చెప్పేవారు.. కాబట్టి.. ఆయనకు మతం లేదని చెప్పకనే చెప్పినట్లు చెప్పారని కొందరు అంటారు..