నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ స్టోరీ.... 4 వేల నుంచి రూ. 600 కోట్ల కల్కి

గురువులు శిష్యులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతారు ఇది అందరికి తెలిసిందే... ఆ జ్ఞానవంతులుగా మారిన శిష్యులు జ్ఞానంలో గురువులను మించి వారితోనే శభాష్ అనిపించుకొంటే... ఆ కిక్కే వేరు... అటువంటి సంఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఆ కోవకు చెందిన వాడే డైరెక్టర్ నాగ్ అశ్విన్...Sri Media News

Jun 28, 2024 - 13:37
 0  5
నాగ్‌ అశ్విన్‌ సక్సెస్‌ స్టోరీ.... 4 వేల నుంచి రూ. 600 కోట్ల కల్కి

తల్లి తండ్రులు డాక్టర్ అవుతాడు అనుకుంటే  డైరెక్టర్‌‌ అయ్యడు. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా 4 వేలు జీతం తీసుకుంటు శిష్యరికం చేసి... ఈ రోజు 600 కోట్ల సినిమా తీసే స్థాయికి ఎదిగాడు... అంతేకాదు.. గురువుని మించిన శిష్యుడుగా పేరు తెచ్చుకున్నాడు.
చిన్నప్పటి నుంచి మీడియా, కథనాలు, వ్యాసాలు రాయడంపై ఆసక్తి ఉన్న నాగ్ అశ్విన్. విద్యార్థి దశలో ‘స్కూల్‌ మ్యాగజైన్‌’కు ఎడిటర్‌గా చేశాడు. ఓ కథనం రాసి ప్రిన్సిపల్‌తో చీవాట్లూ కూడా తిన్న నాగ్...  సీనిమాలపై ఉన్న ఇష్టంతో మణిపాల్ యూనివర్సిటీలో చేరి మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేసాడు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ..., సినీ అభిమానుల హృదయాల్లో నిలిచి సినిమాలు తీస్తూ, సినీరంగంలో తనకంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకుంటున్నాడు...  నాగ్ అశ్విన్ సినిప్రస్థానం గురించి తెలుసుకుందాం...

నాగ్ అశ్విన్ పూర్తి పేరు నాగ్ అశ్విన్ రెడ్డి. ముద్దుగా అందరూ 'నాగి' అని పిలుస్తుంటారు. జయరామ్ రెడ్డి, జయంతి దంపతులకు 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో జన్మించారు. సోదరి నిఖిలా రెడ్డి. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న నాగ్ అశ్విన్.. చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేవారు. చదువుల్లో టాప్ టెన్ ర్యాంకర్లలో ఒకరిగా నిలిచేవారు. విద్యార్థి దశలోనే అతను స్కూల్‌ మ్యాగజైన్‌ కు ఎడిటర్‌ గా స్టోరీలు, వ్యాసాలు రాసేవాడు కూడా. హీరో రానా దగ్గుబాటి ఈయనకు క్లాస్‌ మేట్స్ కూడా... ఓ టైంలో తన పాఠశాలలో బండరాళ్లు పగలగొడుతూ చెట్లు నరికేస్తుంటే ఫొటోలు తీసి.. ‘ఇక్కడేం జరుగుతోంది? ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు?’ అనే వార్త రాసి ప్రిన్సిపల్ కోపానికి గురైయ్యాడు.

తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు. అతని సోదరి నిఖిలా రెడ్డి కూడా డాక్టరే. సో ఇంట్లో వాళ్లు అందరు డాక్టర్లు కావడం వల్ల నాగ్ అశ్విన్ కూడా వారిలాగే డాక్టర్ అవుతాడు అని అనుకున్నారు. అయితే నాగ్ మాత్రం మణిపాల్‌ మల్టీమీడియా కోర్సులో చేరి తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు. కానీ కొడుకు ఇష్టం కాదు అని చెప్పలేని తల్లిదండ్రులు సపోర్ట్ ఇస్తూ వచ్చారు.. ఇలా జరుగుతు ఉండగానే వీడియో ఎడిటింగ్‌పై పట్టు సాధించాడు నాగ్ అశ్విన్. కొడుకు మీడియాలో స్థిరపడతాడేమో అని అనుకుంటే... న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేసాడు... దీంతో కొడుకు సినిమాలపై ఇంట్రస్ట్ తో ఉన్నట్టు గమనించిన నాగ్ అశ్విన్ తల్లి కొడుకును  ప్రోత్సాహిచేవారు...

నాగ్ అశ్విన్ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయడానికి శేఖర్‌ కమ్ముల దగ్గరకు వెళ్ళాడు నాగ్. కానీ అప్పటికి 'గోదావరి' సినిమాతో బిజీగా ఉన్న కమ్ముల.. తర్వాతి ప్రాజెక్టుకు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే అప్పటిదాకా వెయిట్ చెయ్యలేక, మంచు మనోజ్‌ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' సినిమాకు ఏడీగా జాయిన్ అయిపోయాడు నాగ్. అక్కడే నాగ్ అశ్విన్ తోలి సంపాదనగా రూ. 4 వేలు అందుకుని కెరీర్ ప్రారంభించాడు. ‘లీడర్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రాల విషయంలో శేఖర్‌.. అశ్విన్‌కు ఇచ్చినమాట నిలబెట్టుకున్నారు. నాగ్‌ చేసిన ‘లీడర్‌’ ట్రైలర్‌ కట్‌ శేఖర్‌కు నచ్చడంతో దాన్నే విడుదల చేయడం విశేషం. ‘సినిమాని ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీయొచ్చో ఆయన వద్దే నేర్చుకున్నా’ అని ఓ సందర్భంలో గురువును కొనియాడారు నాగ్.

శేఖర్‌ కమ్ముల నుంచి నేర్చుకున్న పాఠాలతో 'యాదోం కీ బరాత్' అనే ఇంగ్లీష్‌ లఘు చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్‌ చేశారు. ఈ చిత్రా కథ నచ్చడంతో ప్రియాంక దత్‌ ఈ చిత్రానికి నిర్మాతగా చేశారు. ఈ చిత్రం కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ కోసం ఎంపిక అయ్యింది... దీంతో నాగ్ అశ్విన్ జీవితం టర్న్‌ అయిపోయింది. ఆ షార్ట్‌ఫిల్మ్‌ వల్ల  నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడే వారికి 'ఎవడే సుబ్రమణ్యం' కథను వినిపించాడు నాగ్. 2015లో నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా తెరకెక్కించి ఈ చిత్రంతోనే నాగి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

అయితే స్విట్జర్లాండ్ లో షూటింగ్ చేసి, దాన్నే మౌంట్ ఎవరెస్ట్‌గా చూపించే అవకాశం ఉన్నప్పటికీ.. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీయాలన్న సంకల్పంతోనే ఎంతో శ్రమించి హిమాలయాల్లో 'ఎవడే సుబ్రమణ్యం షూటింగ్ చేశారు నాగ్ అశ్విన్. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టు మీద, మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాదాపు 40 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఇది ఎవరెస్టు శిఖరంపై చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. నాగికి నంది అవార్డు తెచ్చిపెట్టింది. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా టైంలో స్నేహితులుగా మారిపోయిన నాగ్ అశ్విన్ - ప్రియాంక దత్‌‌లు ప్రేమలో పడ్డారు... 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ఫస్ట్ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరైన రిషి పేరునే తన కొడుక్కి పెట్టుకున్నారు.  'ఎవడే సుబ్రమణ్యం' విమర్శకుల ప్రశంసలు పొందిన తర్వాత, మూడేళ్ల గ్యాప్ తీసుకొని 2018లో 'మహానటి' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకుంది. దీంతో నాగ్ అశ్విన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. 2021లో నెట్ ఫ్లిక్స్ కోసం 'పిట్ట కథలు' అనే ఆంథాలజీ డ్రామాలోని X సెగ్మెంట్‌కు దర్శకత్వం వహించడం ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టారు నాగి. దీనికి ఆడియెన్స్ నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అదే ఏడాది నిర్మాతగా మారి నవీన్ పొలిశెట్టితో 'జాతి రత్నాలు' చిత్రాన్ని రూపొందించారు. ఇది సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ప్రభాస్ హీరోగా 2020 ఫిబ్రవరిలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 'కల్కి 2898 AD' చిత్రాన్ని ప్రకటించారు నాగ్ అశ్విన్. ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు ఏడాది సమయం తీసుకొని, 2021 జూలైలో సెట్స్ మీదకు వెళ్ళారు. ఫ్యూచర్ వరల్డ్ ని ఆవిష్కరించే, ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కోసం రూ. 600 కోట్లకి పైగా ఖర్చు చేశారు. IMAX, 2D, 3D, 4DX ఫార్మాట్‌లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే నాగ్ అశ్విన్ ఇప్పటి వరకూ తీసిన మూడు చిత్రాల్లోని నటులను ఈ ప్రోజెక్ట్‌‌లోకి తీసుకున్నారు. ఇక్కడే నాగి కెరియర్‌‌ బిగిన్ అయినప్పటి నుంచి ఉన్న ప్రతి ఒక్కరు... ఈ భారి ప్రోజెక్ట్‌‌లో ఉండేలా చూసుకున్నారు. దీనిబట్టే చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ క్యారెక్టర్ ఎంటో...  అయితే థియేటర్లలో సందడి చేస్తున్న కల్కి సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో నాగ్ అశ్విన్ కొన్ని రకాల కథలు , పోస్ట్‌లను అభిమానులతో  పంచుకున్నారు. గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమా కోసం కల్కి టీం మొత్తం నాలుగేళ్ల పాటు కష్టపడింది. 2021లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేసిన ఫ్యూచరిస్టిక్ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే తన చెప్పులు అరిగిపోయేలా ఈ సినిమా కోసం పనిచేశానని చెప్పేలా తన అరిగిపోయిన చెప్పులు  ఉన్న ఫోటోలను పంచుకోని అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్.  తొలి చిత్రం'ఎవడే సుబ్రమణ్యం' తో స్టేట్‌ (నంది) అవార్డు, రెండో సినిమా సావిత్రితో నేషనల్‌ అవార్డు పొందిన నాగ్‌ అశ్విన్‌, మూడో మూవీతో ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకోవాలని ఆశిస్తూ నాగ్ అశ్విన్‌‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow