ఈ హీరోలను పరిచయం చేసింది రామోజీరావే....ఆయన సినిమాల్లో కథే హీరో.

మీడియా దిగ్గజం రామోజీరావు మీడియా రంగంలోనే కాదు... సినిమా రంగంలో కూడా రామోజీ రావు తనదైన మార్క్ ప్రదర్శించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు నిర్మించి ఆయన ఎందరో నూతన దర్శకులు, నటీనటుల్ని ప్రోత్సహించారు. Sri Media News

Jun 8, 2024 - 13:06
 0  6
ఈ హీరోలను పరిచయం చేసింది రామోజీరావే....ఆయన సినిమాల్లో కథే హీరో.

రామోజీ రావు స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ఎంతోమంది జీవితాలు మారిపోయాయి. సీనియర్ ఎన్‌టీఆర్ వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్‌టీఆర్ దగ్గర నుంచి తన పాటతో ఆస్కార్ సాధించిన కీరవాణి వరకు ఇలా ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేశారు రామోజీ రావు.

1984లో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీవారి ప్రేమ లేఖ’ అనే సూపర్ హిట్ చిత్రంతో రామోజీరావు నిర్మాతగా మారారు. నరేష్, పూర్ణిమ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. 2000 సంవత్సరం తర్వాత నిర్మాతగా జోరు పెంచిన ఆయన కొందరు స్టార్ హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత అతనికి దక్కుతుంది. నూతన దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్ లను పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘చిత్రం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ తేజ, ఉదయ్ కిరణ్ ఇద్దరూ టాలీవుడ్ లో క్రేజీగా మారిపోయారు. అప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తరుణ్ ని సైతం హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీ రావే. ఆయన నిర్మాణంలో తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన కెరీర్ ను ప్రారంభించినది కూడా రామోజీరావు నిర్మించిన ‘నిన్ను చూడాలని’ చిత్రంతోనే. ఆ మూవీతోనే ఎన్టీఆర్ హీరో అయ్యారు.

 అంతేకాదు... రామోజీ రావు ఇండస్ట్రీకి పరిచయం చేసిన చాలామంది హీరోయిన్లు.. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. అలాంటి వారిలో జెనీలియా, శ్రేయా కూడా ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్న తర్వాత వీరిద్దరూ బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నటీమణులుగా మారారు. ‘ఇష్టం’ మూవీతో శ్రేయా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వగా.. ‘తుజే మేరీ కసమ్’ (తెలుగులో ‘నువ్వే కావాలి’ మూవీ)తో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది. మంచి నటిగా గుర్తింపు పొందింది. తన ఫస్ట్ మూవీలో నటించిన హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. అన్నట్టు.. రితేష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసింది కూడా రామోజీరావే.

తరుణ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ కూడా రామోజీ రావుకే దక్కుతుంది. తరుణ్ ఉషా కిరణ్ మూవీస్‌లో బాల నటుడిగా కూడా నటించాడు. ఆ తర్వాత అతడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను కూడా రామోజీరావే తీసుకున్నారు. ‘నువ్వే కావాలి’ సినిమాతో తరుణ్‌కు టాలీవుడ్‌లో లైఫ్ ఇచ్చారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీకాంత్‌ను కూడా హీరోగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. అథ్లెట్‌గా ఉన్న అశ్వినీ నాచప్పను నటిగా వెండితెరపై వెలిగేలా చేశారు. యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయినా కూడా సుధాచంద్రన్‌లో కాన్ఫిడెన్స్ నింపి ఆమెకు నటిగా, డ్యాన్సర్‌గా గుర్తింపు దక్కేలా చేశారు.

ఇలా రామోజీరావు నిర్మించిన సినిమాలూ చరిత్ర సృష్టించాయి. బడ్జెట్ వేలంవెర్రిలో కొట్టుకుపోకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించడం ఆయనకు అలవాటు. జన సామాన్యంలో జరిగే సంఘటల్నే కథావస్తువులుగా స్వీకరించారు. మౌనపోరాటం, ప్రతిఘటన, మయూరి, పీపుల్స్ ఎన్ కౌంటర్, అశ్విని సినిమాలు అలాంటివే. ఇవన్నీ మంచి సినిమాలుగా గుర్తింపు పొందడమే కాక, ఆర్ధికంగా గొప్ప విజయాలు సాధించాయి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమాల ద్వారా ఎంతోమంది నటీనటులు, దర్శకులు వెండితెరకు పరిచయమయ్యారు. జైపూర్ చెక్క కాలితో నాట్యం చేసే సుదాచంద్రాన్ని, పరుగుల రాణి అశ్వని నాచప్పని కథానాయికలుగా, కీరవాణిని, ఎస్. జానకిని సంగీత దర్శకులుగా, జూనియర్ ఎన్టీఆర్, శ్రియ లాంటి ఎంతో మందిని తారలుగా మలచిన ఘనత ఆయనదే.

ఆ రోజుల్లో  మార్కెట్‌లో క్రేజ్‌ ఉన్న ఏ కథనాయకుడైనా టక్కున కాల్షీట్లు ఇచ్చేవారు. కానీ రామోజీరావు  మాత్రం తారలను సృష్టించే కథలను నమ్మారు. అందుకే తన సినిమాల్లో కథలు మత్రమే హీరోలు అన్నట్టుగా ఆయన సినిమాలు నిర్మించారు... చిన్న హీరోలతో  అనేక సంచలనాలు సృష్టించారు.

రామోజీరావు తన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్పగొప్ప చిత్రాలను నిర్మించారు. అందుకే ఆయనకు ఎన్నో అవార్డులు లభించాయి. ముఖ్యంగా తన కెరీర్‌లో ఈ దిగ్గజ నిర్మాత 'నువ్వే కావాలి' చిత్రానికి నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే, నాలుగు ఫిల్మ్‌ఫేర్స్, ఐదు నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. వీటితో పాటు పద్మ విభూషణ్ పురస్కారం తీసుకున్నారు.

ఇంత సాధించిన ఆయన చివరి కోరిక తీరకుండా మరణించారంట... రామోజీరావుకు నిర్మాతగా 100 చిత్రాల మార్కును దాటాలని కోరిక ఉండేది. ఆయన ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. దీంతో ఇప్పుడీ అంశం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఫ్యూచర్‌లో 'ఉషా కిరణ్ మూవీస్' బ్యానర్ వంద సినిమాల మార్కును చేరుతుందో లేదో చూడాల్సిందే.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow