ఇప్పుడు పవన్ సూర్యారాధన క్రతువు చేపట్టారు. దీంతో ఏంటీ సూర్యారాధన అంటూ తెగ వెతికేస్తున్నారు. ఈ సూర్యారాధన ఎందుకు చేస్తారు.. చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి.. తెలుసుకుందాం రండి.
వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన క్రతవులో పాల్గొన్నారని జనసేన పార్టీ ప్రకటించటంతో పాటు.. పూజకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా సూర్యారాధనపై చర్చ మెుదలయ్యింది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు, ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు. ఇందు కోసం ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుటు ఆశీనులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజించారు. పవన్ కళ్యాణ్ గతంలో రోజూ సూర్య నమస్కారాలు చేసే వారు. అయితే గత కొంతకాలంగా వెన్నుకు సంబంధించిన చిన్న ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. దీంతో సూర్య నమస్కారాలు చేయడానికి విరామం ఇచ్చారు. అందుకు బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు.
కాగా భారతీయులు, సూర్యదేవుడికి విశిష్టమైన స్థానాన్ని కల్పించినట్లు చెప్తారు పెద్దలు. ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమే అంటారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోంది. కానీ బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయిందని, నిజానికి మన దేశ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందన్నారు. రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని గుర్తు చేశారు. అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా అంటారని వేద పండితులు తెలిపారు.
సృష్టికి వెలుగులు ప్రసాదించే ఆదిత్యుడిని నెలకో పేరుతో ఆరాధిస్తారు. 12 నెలల్లో ఒక్కో నెలలో ఒక్కో పేరుతో పూజిస్తారు. ఇలా కాలాన్ని అనుసరించి సూర్యుడిని ఆరాధించే రూపాలనే ద్వాదశ ఆదిత్యులు అని చెబుతారు. చైత్రమాసంలో ధాత, వైశాఖంలో అర్యముడు, జ్యేష్ఠమాసంలో మిత్ర, ఆషాడమాసంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదమాసంలో వివస్వంతు, ఆశ్వయుజ మాంలో త్యష్ట, కార్తీమాసమంలో విష్ణువు, మార్గశిరమాసంలో అంశుమంతుడు, మాఘమాసంలో పూష, ఫాల్గుణమాసంలో క్రతువు పేర్లతో పూజలు చేస్తారు.
సూర్యుడిని ఆరాధించేందుకు ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో అర్చన, జపం, ప్రదక్షిణ, నమస్కారం, అర్ఘ్యం, ధ్యానం, నిష్ఠ అనే ఆరు పద్ధతులు అత్యంత ముఖ్యమైనవి. నిత్యం సూర్యుడికి ఆరు పద్ధతులు భక్తిప్రపత్తులతో నిర్వహించేవారికి సర్వకార్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యానికి సూర్యారాధనను మించిన దివ్యమైన ఔషధం లేదు. అందుకే అంటారు 'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అని. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఎలాంటి అనారోగ్యం అయినా సూర్యరాధనతో నయమవుతుందంటారు. ఇంటి మధ్యలో కానీ ఈశాన్య భాగంలో కానీ సూర్యారాధన చేస్తారు. 40 రోజులు, 20 రోజులు, 12 రోజులు ఆరాధన నిర్వహిస్తారు..ఏకాదశ అంటే 11 రాత్రులు పూర్తయ్యాక 12 వ రోజు దీక్ష విరమిస్తారు.
అటు దేశ సంక్షేమం ఇటు ఆరోగ్యం కోసం పవన్ చేపట్టిన ఈ సూర్యారాధన క్రతువుపై సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఏపీలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు ఎంతో మంది. పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి పేరుని తన వాహనానికి నామకరణం చేయటం, దగ్గర నుంచి తాజాగా సూర్యారాధన క్రతువు చేయటం వరకు ప్రతీది హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మరుగున పడిపోతున్న ఎన్నో ఆచారాలను బయటకు తీసుకువచ్చి ప్రజలకు పరిచయం చేస్తున్నారు పవన్.
దేవీ ఉపాసకులకు తప్పితే.. సామాన్య ప్రజలకు అంతగా తెలియని వారాహీ మాత గురించి ప్రజలకు పరిచయం చేసింది పవన్ కల్యాణ్ అని చెప్పటంలో సందేహమే లేదు. వారాహీ మాతను పూజించటం మెుదలు పెట్టిన తరువాతే.. పవన్ పొలిటికల్‌గా బలపడ్డారనీ, హాండ్రెడ్ పర్సంటేజ్ స్ట్రైక్ రేట్ వచ్చిందని చాలా మంది అంటుంటారు. అంతేకాదు ఎన్నికల ముందు పవన్ పెట్టుకున్న రెండు ఉంగరాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అందులో ఒకటి నాగబంధం, ఇంకొకటి కూర్మావతారంది. పవన్ జాతక రీత్యా ఈ రెండు ఉంగరాలు కలిసి వస్తుందని జ్యోతిష్కులు చెప్పారు.. ఆయన పెట్టిన తేదీ, టైమ్ బట్టి పవన్‌ది మకర రాశి.. ఈ రాశి వారికి ఈ రెండు ఉంగరాలు కలిసి వస్తాయి అని చెప్పటంతో.. పవన్ వాటిని ధరించారు. ఆ తరువాత పిఠాపురం నుంచి ఎన్నికల పోటీలో నిలబడటం.. గెలవటం.. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించటం ఇవన్నీ మనకు తెలిసిందే.