డిసెంబర్ 10 లోపు 16 వేల ఉద్యోగాల భర్తీ..ఎన్నికల హామీల అమలుపై చర్చ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి కేబినెట్ భేటి ముగిసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సంతకాలు పెట్టిన మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) ఐదు సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.Sri Media News
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సమావేశమైన మంత్రివర్గం, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలోని అన్ని అంశాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నడిచిన ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నెలకు రెండు సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించే సాంప్రదాయాన్ని తిరిగి పునరిద్దరించనున్నారు.
కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. పెన్షన్ల పెంపు అంశంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే జూలై 1 తేదీ నుంచి 3 వేల రూపాయల నుంచి 4 వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు 3 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. వచ్చే నెలలో 65 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఒకేసారి 7 వేలు అందుకోనున్నారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది. వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ - 6 పథకాల అమలు, అందుకు అణుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించినట్లు సమాచారం.
అలాగే, విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వివిధ శాఖల శ్వేత పత్రాల విడుదలకు సంబంధించి క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేత పత్రాల విడుదలపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు, ఆర్థిక అవకతవకులపై మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేయనుంది. మంత్రివర్గ ఉప సంఘంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ, నాదెండ్ల మనోహర్, హోం మంత్రి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా శ్వేత పత్రాల విడుదల చేయనుంది.
అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంపై క్యాబినెట్లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని చంద్రబాబు ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో డామేజ్ గురైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా చేయాలనే దాని పై క్యాబినెట్ లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి, నిధుల సమీకరణ ఏవిధంగా చేయాలి అనే అంశంపై క్యాబినెట్లో చర్చించినట్లు సమాచారం.
వివిధ కార్పొరేషన్ల పునరుద్దరణ వాటికి నిధుల సమీకరణ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్థి, ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు, వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నూతన విద్యవిధానం, ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది. కాగా.. 25 మంది సభ్యులున్న కేబినెట్లో 17 మంది కొత్తవారు, 8 మంది అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారు.
What's Your Reaction?