ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ నేత సూర్యమునిపై దాడి, పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ష్యూరిటీలు సమర్పించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే వెళ్లాల్సి ఉంది. దీంతో ఈరోజు తెల్లవారుజామున పెద్దారెడ్డి నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లారు.
నేరుగా తాడిపత్రిలోని పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పెద్దారెడ్డి... ష్యూరిటీలు సమర్పించి, సంతకం చేసి వెళ్లిపోయారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత... పెద్దారెడ్డిని ఎక్కువ సేపు తాడిపత్రిలో ఉంచకుండా పోలీసులు అనంతపురంకు తరలించారు. పెద్దారెడ్డి కూడా అడ్డు చెప్పకుండా తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారు.
ఈ ఘటన పై కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడారు... ‘‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదు, నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.
అయితే గతంలో... తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్ల పై దాడికి దిగారు. దీంతో టీడీపీ నాయకుడు సూర్యముని అనుచచరులు వైసీపీ ఏజెంట్లను నిలదీయగా అతను పెద్దారెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లడంతో ఆయన ఆవేశంతో మా వర్గీయులనే ప్రశ్నిస్తారా అంటూ.. ఆయన అనుచరులతో కలిసి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసు బలగాలు అల్లరి మూకలను చెదరగొట్టారు... ఈ క్రమంలోనే పట్టణ సీఐ మురళీ కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో కేంద్ర బలగాలు భారీగా తాడిపత్రికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టి తాడిపత్రిలో ఘర్షణలకు కారణం పెద్దారెడ్డిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.