రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలకు నిలయమైన ప్లేసుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఒకటి. ఇక్కడికి వెళ్తే... గోదావరి ఒడ్డున వెలసిన రాములోరిని దర్శించుకొని దీవెనలు పొందొచ్చు. సీతారాములు నివసించిన పర్ణశాలని చూడొచ్చు. శ్రీరాముడి జన్మభూమి ఇంకెక్కడో ఉండవచ్చు. కర్మభూమి మాత్రం తెలంగాణ గడ్డే.. కారణం, ఇక్కడ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి అడవులలో సంచరించాడు. ఇక్కడి కందమూలాలు తిన్నాడు. ఇక్కడి తోటల్లో సీతాసమేతుడై విహరించాడు. ఇక్కడి జలాశయాల్లో స్నానం చేశాడు. ఈ నేల సాక్షిగా సంధ్యాది విధులలో సంకల్పం చెప్పుకొన్నాడు. అయితే అసలు భద్రాచలంలో రాముడు ఎందుకు వెలిశాడు..? భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చింది అని చాలా మందికి డౌట్ ఉంటుంది.. ఆ ఆ స్థలం పురాణం గురించి తెలుసుకుందాం రండి.
ఈ భద్రగిరి చరిత్ర ప్రారంభం అయ్యింది రామాయణ కాలంలోనే. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దండకారణ్యం. వనవాసం సమయంలో రాముడు ఇక్కడ గడిపాడని, బంగారు లేడిని చూడటం, మారీచ వధ, రావణుడు సీతను ఎత్తుకుపోవటం అన్నీ ఇక్కడికి కొంచెం దూరంలో వున్న పర్ణశాలలో జరిగాయనీ, ఈ ఆలయం ప్రాంతం నుంచే రాముడు గోదావరి దాటాడని అంటారు. శ్రీ రాముడు రామావతారం ముగిసిన తర్వాత యుగాల తరబడి తపస్సు చేస్తున్న తన భక్తుడు భద్రుడు కోసం ఈ ప్రదేశంలో వెలిశాడు. రాముడు అవతారం ముగిసి వైకుంఠం చేరిన చాలాకాలం తర్వాత శ్రీ మహా విష్ణువు భక్తునికిచ్చిన మాటకోసం మళ్ళీ వైకుంఠం నుంచి రామావతారంలో వచ్చి ఇక్కడ వెలిశాడుకనుక ఈ రాముణ్ణి వైకుంఠ రాముడని కూడా పిలుస్తారు. ఈ భద్రాచలం అని పేరు రావటం వెనుక పెద్ద కథే ఉంది.
మేరు పర్వత కుమారుడైన భద్రుడు రాముడు తనపై నివాసం ఏర్పరచుకోవాలని తపస్సు చేశాడు. ఆ సమయంలో రాముడు సీతని కోల్పోయి ఆవిడ కోసం వెతుకుతూ వుంటాడు. అందుకని సీతని తీసుకువచ్చిన తర్వాత భద్రుని కోరిక తీరుస్తానని మాట ఇచ్చి సీతాన్వేషణలో వెళ్తాడు. భద్రుడు తన తపస్సు కొనసాగిస్తాడు కానీ రాముడు ఈ విషయం మరచిపోతాడు. తర్వాత అవతార పరిసమాప్తి కూడా అవుతుంది.
భద్రుడు మాత్రం తన తపస్సు తీవ్రం చేశాడు. ఆ తపశ్శక్తికి వైకుంఠవాసుడికి భద్రుడి కోరిక గుర్తు వచ్చి, హడావిడిగా బయల్దేరాడు. విష్ణు మూర్తి అలవాటు ప్రకారం శంఖు చక్రాలు తీసుకున్నాడు గానీ తొందరలో అవి తారుమారు అవుతాయి. కుడి చేతిలో ఉండాల్సిన సుదర్శన చక్రం ఎడమ చేతికి, ఎడమ చేతిలో ఉండాల్సిన శంఖు కుడి చేతికీ మారాయి. భక్తుడు కోరుకున్నది రామావతారం గనుక విల్లంబులు తీసుకున్నాడు. అలా శ్రీ లక్ష్మి సీతగా, శేషుడు లక్ష్మణుడుగా వెంటరాగా భద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.
చతుర్భుజాలలో శంఖ, చక్ర విల్లంబులతో, సీతా లక్ష్మణ సమేతంగా తనముందు ప్రత్యక్ష్యం అయిన శ్రీరామచంద్రుడిని చూసి భద్రుడు సంతోషిస్తాడు. తన కోసం ఇంతకాలం తపస్సు చేసిన నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు రాముడు.. ఇప్పుడు నువ్వు దర్శనం ఇచ్చిన విధంగానే.. నా శిరస్సుపై సదా ఉండిపోవాలి అని కోరాడు భద్రుడు. అప్పుడు శ్రీరామ చంద్రుడు పంచ భూతాలు ఉన్నంత కాలం భద్రునిపై సీతా లక్ష్మణ సమేతంగా ఉంటాననీ.. తనతో పాటు భద్రుడిని కూడా దర్శించుకున్న వారికి అన్నీ శుభాలే జరుగుతాయని వరం ఇచ్చాడు. అలా శ్రీరామ చంద్రుడు భద్రుడి శిరస్సుపై వెలశాడు.. భద్రుడిపై వెలిశాడు కాబట్టి ఆనాటి నుంచి భద్రాచల శ్రీరాముడిగా పూజలు అందుకుంటున్నాడు.. శ్రీరాముడు అంటేనే నిలువెత్తు ధర్మ స్వరూపం. మాట తప్పని సహజ లక్షణం. కాబట్టే, భద్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. భద్రగిరిమీద వెలిశాడు. ‘భద్రాచల రాముడ’న్న పేరు తెచ్చుకున్నాడు.
మరి అక్కడ వెలసిన శ్రీరాముడిని కనిపెట్టింది ఎవరు? ఆ రాములోరికి గుడి కట్టింది ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం... భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు.. అని ఆదేశించారట. ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించే వారని స్థలపురాణం చెబుతుంది.
అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి.. ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవం.. భద్రాచల శ్రీరామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు.
ఈ విషయం నవాబ్ తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా... ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించాయి..
తానీషా చాలా అదృష్టవంతుడు. గుడి కట్టించిన గోపన్నకు దొరకని రామ దర్శనం తానీషాకు దొరికింది. రామ లక్ష్మణులు తానీషా దగ్గరకు రామోజీ, లక్ష్మోజీ పేర్లతో గోపన్న సేవకులుగా వెళ్ళి ఆయన చెల్లించవలసిన సుంకం డబ్బు చెల్లిస్తారు. తానీషా వారికి రశీదు కూడా ఇస్తాడు. వారు దానిని గోపన్న తల దగ్గర పెట్టి మాయమవుతారు.
మర్నాడు తానీషా గోపన్నను చెర విడిపించి విషయమంతా తెలుసుకుని, రామోజీ లక్ష్మోజీ కట్టిన శిస్తు డబ్బు ఆరు లక్షల మొహరీలు కూడా గోపన్నకు ఇస్తాడు. కానీ రామదాసు వాటిని స్వీకరించక, శ్రీరాముని గుర్తుగా రెండు మొహరీలు మాత్రం తీసుకుంటాడు. అవి ఇప్పటికీ ఆలయంలో వున్నాయి.
అప్పటి నుంచి తానిషా ఆలయ నిర్వహణా బాధ్యత వహించటమేగాక పాల్వంచ పరగణా నుంచి వచ్చే సొమ్ము దేవాలయానికి చెందేటట్లు శాసనం చేశాడు. అంతేకాదు స్వామివారి కళ్యాణానికి ఏనుగు మీద ప్రత్యేక అధికారితో ముత్యాల తలంబ్రాలు పంపించ సాగాడు. ఆ ఆనవాయితీ నేటికీ సాగుతోంది. స్వామివారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తారు.
తర్వాత పాల్వంచ తహసీల్దారుగా గుంటూరు నుంచి తూము నరసింహ దాసు వచ్చాడు. ఆలయ నిర్వహణ బాధ్యత వహించిన ఆయన ఆలయంలోని రెండు స్తంబాలమీద ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి పవళింపు సేవ దాకా ఆలయంలో స్వామికి జరగవలసిన సేవల గురించి చెక్కించాడు. వాటి ప్రకారమే నేటికీ అన్ని పూజలూ జరుగుతున్నాయి.